Saturday, February 24

మగవాళ్లు ఆదివారం తలస్నానం చేస్తే ఏమవుతుందంటే..!

తల స్నానం చేయడంలో శారీరక శుభ్రత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఫలితాలు కూడా ఉన్నాయనేది ఆధ్యాత్మికుల నమ్మకం. అందుకే దైవ భక్తి కలిగిన వారు ఏరోజు పడితే ఆరోజు తల స్నానం చేయరు.. ఆడపిల్ల అంటే లక్ష్మి దేవితో సమానం కాబట్టి మన పెద్దలు శుక్రవారం తలంటు అలవాటు చేశారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదట. ఎంతో తప్పనిపరిస్థితి అయితేనే మాత్రమే చేయాలట. స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బుధవారం చేస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. సోమవారం తలంటు చేస్తే నిత్య సౌభాగ్యంతో వర్దిల్లుతారు. భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.
కేవలం మహిళలే కాదు పురుషులు కూడా కొన్ని రోజుల్లో తలస్నానం చేయరాదట. పురుషులు శనివారం తల స్నానం చేస్తే మహా వైభోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతోపాటు ఆ కోరికలు పెరుగుతాయట. సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుందట. మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుందట. బుధవారం తలం స్నానంతో లక్ష్మి దీవెనలు, గురువారం తలంటు స్నానంతో ఆర్ధిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి. శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. ఈ నియమాలకు అనుగుణంగా స్త్రీ, పురుషులు తలం స్నానం ఆచరిస్తే మంచిదట.

Friday, February 16

ఎండుద్రాక్ష...

చాలామంది ఎండు ద్రాక్షను మిఠాయిల తయారీలో మాత్రమే వాడుతుంటారు. నిజానికి వీటిని రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
అజీర్తి, రకరకాల కారణాల వల్ల మలబద్దకం బాధిస్తుంటుంది. అలాంటివారు ఎండుద్రాక్షను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఆ సమస్యా తగ్గుతుంది. దానికి కారణం వాటిల్లో పీచు ఎక్కువగా ఉండటమే.
* బరువు తగ్గాలనుకునేవారికి ఎండుద్రాక్ష ఎంతో మేలుచేస్తుంది. వీటిల్లోని గ్లూకోజ్‌ శరీరానికి శక్తినిస్తుంది. రోగ నిరోధకశక్తినీ పెంచుతుంది. పైగా కొన్నే తిన్నా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. కుదిరితే వ్యాయామం తరవాత వీటిని తీసుకోవచ్చు.
* చిన్నారులూ, క్రీడాకారులూ వీటిని రోజూ తీసుకోవాలి. ఎండుద్రాక్షలో ఉండే క్యాల్షియం, బోరాన్‌ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి.
* రోజూ ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, క్యాన్సర్‌ కారకాలూ దూరమవుతాయి.

* ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరికి నోటి దుర్వాసనా, చిగుళ్ల సమస్యలు బాధిస్తుంటాయి. అలాంటివారు ఎండుద్రాక్షల్ని నోట్లో వేసుకుని ఎక్కువసేపు నములుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్యలు అదుపులోకి వస్తాయి.
* అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే సమస్య రక్తహీనత. ఆ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఇనుము, రాగి, విటమిన్‌ బి పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవన్నీ ఎర్రరక్తకణాల వృద్ధిని పెంచడం, రక్తప్రసరణలో లోపం లేకుండా చూస్తాయి.

Saturday, February 10

ఏక మూత్ర పిండం.. అనర్థదాయకం...

మానవ దేహంలో రెండు కిడ్నీలు ఉంటాయనేది సర్వసాధారణ విషయం. అయితే... ఒక కిడ్నీతో పుట్టే వారు కూడా ఉంటారని మీకు తెలుసా? అవును.. సింగిల్‌ కిడ్నీ పర్సన్స్‌ కూడా ఉంటారు. ఇది అరుదైన విషయం. చాలామందికి దీనిపై అవగాహన ఉండకపోవచ్చు. తాము ఏక మూత్రపిండంతో కాలం వెళ్లదీస్తున్నామనేది చాలా మందికి తెలియకపోవచ్చు. తమ బిడ్డ ఈ లక్షణంతో జన్మించాడనేది తల్లిదండ్రులు తెలుసుకోలేక పోవచ్చు. ఏదేమైనా సింగిల్‌ కిడ్నీ వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఒక వ్యక్తి ఒక కిడ్నీ మాత్రమే కలిగి ఉన్నా... శరీరంలో ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తున్నా దానిని వైద్య పరిభాషలో 'సాలిటరీ కిడ్నీ' అంటారు. అలాంటి పరిస్థితి కలిగిన వ్యక్తిని 'సింగిల్‌ కిడ్నీ స్టేటస్‌' అనంటారు. సగటున 400 ప్రత్యక్ష జననాల్లో ఒకరు ఏక మూత్ర పిండంతో జన్మించొచ్చు. లేదా ఆ బిడ్డకు రెండు కిడ్నీలు ఉన్నప్పటికీ అందులో ఒకటి మాత్రమే పనిచేయొచ్చు. లేదా పుట్టిన తర్వాత ఇంకొక కిడ్నీ వ్యాధి బారిన పడి పనిచేయకపోవచ్చు. ఇదిలాగుండగా కిడ్నీ దానం చేసిన వ్యక్తులు కూడా 'సాలిటరీ కిడ్నీ' కలిగి ఉంటారు. అలాంటి వారు సాధారణ, ఆరోగ్యకర జీవితాన్నే గడుపుతారు. ఇక్కడ రెండు కిడ్నీల పనిని ఒక కిడ్నీ మాత్రమే చేస్తుంది.
తాము సింగిల్‌ కిడ్నీతో జన్మించామనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. తమకు పుట్టిన బిడ్డకు ఇలాంటి లోపం ఉందనే విషయం తెలియరాకపోవచ్చు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా మాత్రమే దీనిని గుర్తించే అవకాశముంది. పుట్టుకతో ఒక కిడ్నీ మాత్రమే కలిగి ఉన్న వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాలిటరీ కిడ్నీ కారణంగా అధిక రక్తపోటు, మూత్రం ద్వారా శరీరంలోని ప్రొటీన్‌ బయటకు వెళ్లిపోవడం, వడబోత సామర్థ్యం తగ్గడం లాంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఏర్పడొచ్చు. ఈ పరిస్థితులు నియంత్రణలో ఉన్నంత వరకు శరీరంపై ఎలాంటి దుష్పప్రభావం చూపించదు. అయినప్పటికీ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. పుట్టిన బిడ్డకు ఒక కిడ్నీ మాత్రమే ఉందని నిర్ధారణైతే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎదుగుతున్న ఆ కిడ్నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన పర్యవేక్షణ అవసరం. ఇలాంటి వారి జీవన శైలిలో మార్పులు తీసుకురావడం తప్పనిసరి.
తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు :-
  1. సింగిల్‌ కిడ్నీ కలిగి ఉన్న బిడ్డల విషయంలో పలు ముందు జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి కారణం లేకుండా జ్వరం వస్తే యూరిన్‌ కల్చర్‌ సెన్సిటివిటి పరీక్ష చేయించాలి. ఫలితం పాజిటివ్‌గా వస్తే దానికి తగిన చికిత్స చేయించాలి.
  2. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడటానికి కారణాన్ని ఎంసీయూజీ, డీఎంఎస్‌ఏ స్కాన్ల ద్వారా నిర్ధారించుకుని తగిన వైద్యం చేయించాలి.
  3. సింగిల్‌ కిడ్నీతో జన్మించిన బిడ్డకు రెండేండ్ల వయసు వచ్చినప్పటి నుంచి తనంతట తానే టాయిలెట్‌కు వెళ్లడం నేర్పించాలి. ప్రతి రెండు గంటలకోసారి మూత్రానికి వెళ్లేలా పోత్సాహించాలి. వెనువెంటనే మూత్రం చేసే అలవాటు మాన్పించాలి.
  4. పాఠశాలలోని టాయిలెట్‌ పరిశుభ్రంగా లేకపోయినా మూత్రవిసర్జన చేయాల్సిందేనని పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అపరిశుభ్రమైన టాయిలెట్‌ను ఉపయోగించడం ద్వారా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడదు. కానీ.. మూత్రాన్ని అలాగే బిగపట్టడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ కలుగుతుంది.
  5. పిల్లలు ఉదయాన్నే సులభంగా, సౌకర్యంగా మూత్రవిసర్జన చేసేలా తగిన శిక్షణ ఇవ్వాలి. ఇందుకు వారి ఆహారం, అలవాట్లలో తగిన మార్పులు చేయాలి. నిండిపోయిన పేగుల వల్ల యూరినరీ బ్లాడర్‌పై ఒత్తిడి కలిగి ఇరిటేషన్‌, మూత్రం నిలిచిపోవడం వంటి ఇతర సమస్యలు ఏర్పడొచ్చు.
ఆహారం :-
పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, తక్కువ కొవ్వు కలిగిన డైరీ ఉత్పత్తుల వంటి ఆరోగ్యకర ఆహారం తీసు కోవాలి. తక్కువ ఉప్పు, కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల దీర్ఘకాలం లో అధిక రక్తపోటు బారినపడే ప్రమాదం ఉంది. తద్వారా కిడ్నీకి నష్టం జరగొచ్చు. మాంసం, కోడి గుడ్డు లోని పచ్చ సొనలో కొలెస్ట్రాల్‌, ప్రొటీన్‌ అధిక మోతాదులో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవడం తగ్గించాలి. చేపలు, చికెన్‌ తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
దైనందిన చర్య :-
సింగిల్‌ కిడ్నీ కలిగి ఉన్న పిల్లలు తమ దైనిందిన కార్యకలాపాలను మామూలుగానే కొనసాగించొచ్చు. సాకర్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ వంటి కఠిన ఆటలకు మాత్రం దూరంగా ఉండాలి. రెండు కిడ్నీల పనిచేసే ఈ ఒక్క కిడ్నీ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. దీనినే కాంపెన్సెటరి హైపర్‌ట్రోపి అంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కిడ్నీ సులభంగా గాయపడే అవకాశం ఉంది.
జాగ్రత్తలు..!
ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా డాక్టర్‌ వద్దకు వెళ్లినప్పుడు సాలిటరీ కిడ్నీ స్టేటస్‌ గురించి తెలియజేయడం తప్పనిసరి. కిడ్నీకి అపాయం కలిగించే మందులు కొన్ని ఉంటాయి. పరిస్థితిని ముందస్తుగానే డాక్టర్‌కు తెలిపితే వాటిని సిఫార్సు చేయకుండా జాగ్రత్త పడతారు. సింగిల్‌ కిడ్నీ గల వారు నిమెసులైడ్‌, మెఫానమిక్‌ యాసిడ్‌, ఇబూప్రూఫెన్‌ వంటి పెయిన్‌ కిల్లర్స్‌ వాడొద్దు. వాటి స్థానంలో 'పారాసిటమాల్‌' తీసుకోవాలి.
వైద్య పరీక్షలు :-
సాధారణ వైద్య పరీక్షలతోపాటు అధిక రక్తపోటు, యూరిన్‌లో ప్రొటీన్‌ వంటి టెస్టులను నెల నుంచి ఏడాది పాటు పర్యవేక్షించాలి. ఏదైనా సమస్యను ముందస్తుగానే గుర్తిస్తే మొత్తం మూత్రపిండం పనితీరుకు సంబంధించిన పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి.