అపెండిక్స్ అంటే.. 24 గంటల నొప్పి అని
చాలా మందికి తెలుసు. వాస్తవానికి ఇది రుగ్మత పేరు కాదు. ఉదరానికి కుడి
వైపు కొద్దిగా కిందకు ఉండి పెద్ద పేగుకు అతుక్కుని ఉన్న చిన్న ట్యూబ్
లాంటి భాగాన్ని అపెండిక్స్ (ఉండకం) అంటారు. ఈ భాగం ఇన్‌ఫ్లమేషన్‌కి
గురైతే దాన్ని 'అపెండిసైటిస్' అంటారు. చాలా మంది దీన్నే అపెండిస్‌గా
వ్యవహరిస్తుంటారు. అపెండిసైటిస్ తీవ్రరూపం దాల్చినప్పుడు శస్త్రచికిత్స
తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే వైద్య పరిభాషలో దీనిని అత్యవసర
స్థితిగా పరిగణిస్తారు. దీనికి ఆపరేషన్ ఒక్కటే సరైన చికిత్స. సకాలంలో
ఆపరేషన్ చేయకపోతే అపెండిక్స్ పగిలి ఇన్‌ఫెక్షన్‌కు గురై ఒక్కోసారి మరణం
కూడా సంభవించొచ్చు. అపెండిసైటిస్‌కి ఏ వ్యక్తి అయినా గురికావచ్చు. కానీ
సాధారణంగా ఇది 10-30 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఎన్ని రకాలు?
అపెండిసైటిస్ ప్రధానంగా రెండు రకాలుగా రావచ్చు. 1. అబ్‌స్ట్రక్టివ్,
2. ఇన్‌ఫెక్టివ్. అబ్‌స్ట్రక్టివ్ అంటే పేగుల్లోని మలం గానీ,
నులిపురుగుల వంటివిగానీ ఈ ఉండుకం మార్గానికి అడ్డుపడొచ్చు. అప్పుడు
ఉండుకంలో తయారయ్యే మ్యూకస్ స్రావాలు బయటకు రావటం కష్టమవుతుంది. కాబట్టి
లోపలే ఉబ్బి.. వాపునకు కారణమ వుతుంది. అలాగే ఇన్‌ఫెక్టివ్ అంటే మనం
తీసుకున్న ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా వంటివి పేగుల్లోకి చేరి..
అక్కడ్నుంచి ఉండుకంలోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌కి దారి తీయొచ్చు.
లక్షణాలు
అపెండిసైటిస్
సమస్య ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు,
ఆకలి లేకపోవటం.. లాంటివి ప్రధాన లక్షణాలు. అపెండిసైటిస్‌ని
నిర్ధారించటంలో ఈ లక్షణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
అపెండిసైటిస్ నొప్పి
ముందు బొడ్డు దగ్గర, దాని చుట్టూ వస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ
ఉండుకం ఉండే చోటు అయిన కుడివైపు పొత్తికడుపు భాగానికి మళ్లుతుంది. అందుకే
దీన్ని 'షిఫ్టింగ్ పెయిన్' అంటారు. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు
6-8 గంటల తర్వాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. దీన్ని
అపెండిసైటిస్ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. పొట్టలో ప్రధాన నాడులన్నీ
బొడ్డు దగ్గర కేంద్రీక తమవుతాయి కాబట్టి కడుపులో ఎక్కడ సమస్య తలెత్తినా
ముందు బొడ్డు దగ్గరే నొప్పి ఆరంభమవుతుంది. ఇక ఇన్‌ఫెక్షన్ ముదిరి, వాపు
పెరిగిన కొద్దీ ఉండుకం ఉండే చోట నొప్పి ఎక్కువ అవుతుంది.
నొప్పి
ఆరంభమైన తర్వాత జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడూ 100.4 డిగ్రీల సెంటీగ్రేడ్
కన్నా ఎక్కువగా ఉంటుంది. మధ్యమధ్యలో తగ్గడమనేది ఉండదు.. జ్వరం ఎప్పుడూ
ఒకేలా ఉంటుంది.
కొందరిలో ఒకట్రెండు వాంతులు అవుతాయి. కొందరిలో అవీ
ఉండకపోవచ్చు కూడా. ఈ వాంతులు పేగుల్లో అవరోధాల కారణంగా వచ్చేవి కావు.
నాడుల్లో స్పందనల వల్ల వస్తాయి. అందుకే వీటిని 'రిఫ్లక్స్ వామిటింగ్స్'
అంటారు.
అపెండిసైటిస్ అనేది పేగులకు సంబంధించిన సమస్య కాబట్టి ఆకలి
తగ్గిపోయి ఆహారం సయించదు. - ఈ లక్షణాలు కనబడినప్పుడు అపెండిసైటస్ అని
అనుమానించాలి.
మెక్‌బర్నీస్ పాయింట్ : కడుపు నొప్పి వచ్చి ఉండుకం
వాచినప్పుడు అది అపెండిటైటిస్ నొప్పా.. కాదా..? అని గుర్తించడానికి ఒక
సూత్రం ఉంది. కుడివైపు ఎముక (ఇలియాక్ స్పైన్) నుంచి బొడ్డు వరకు ఒక
గీతను ఊహించుకోండి. దీన్ని 'స్పైనో అంబ్లికల్ ల్కెన్' అంటారు. ఈ గీతను
మూడు భాగాలు చేసి బొడ్డు నుంచి రెండు భాగాలు దాటిన తర్వాత మూడో భాగం
మొదట్లో పాయింట్ ముఖ్యమైంది. దీనికిందే ఉండుకం ఉంటుంది. అపెండిక్స్ వాపు
వచ్చినప్పుడు ఈ పాయింట్ వద్ద వేలితో నొక్కితే రోగి నొప్పితో
విలవిల్లాడిపోతారు. దీన్నే 'మెక్ బర్నీస్ పాయింట్' అంటారు. పొత్తికడుపు
అంతా ఎక్కడ నొక్కినా పెద్దగా స్పందించరుగానీ.. ఈ 'పాయింట్' వద్దకు రాగానే
చేత్తో కూడా తాకనివ్వరు. నొప్పి ఉండుకానికి సంబంధించినదేనని చెప్పేందుకు
ఇది కీలకమైన సంకేతం.
పెరిటోనైటిస్: అపెండిక్స్ వాచిన తర్వాత క్రమంగా
సమయం గడుస్తున్న కొద్దీ ఇన్‌ఫెక్షన్ కడుపులోని ఇతర పొరలకూ వ్యాపించి ఆ
ప్రాంతంలో పెరిటోన్కెటిస్‌కి దారి తీస్తుంది. అప్పుడు పొత్తికడుపు కండరం
నొక్కితే గట్టిగా తయారవుతుంది. దీన్ని 'మజిల్ గార్డింగ్' అంటారు.
అపెండిక్స్ వాపు వచ్చినపుడు దగ్గితే ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి
వస్తుంది. ఈ నొప్పి ఎక్కడో కచ్చితంగా చూపించగలుగుతారు కూడా. ఎడమ కాలు
కదపమంటే తేలికగా కదుపుతుంటారు. కానీ కుడికాలు కదపమంటే భయంభయంగా, నొప్పితో
కదపలేకపోతుంటారు. ఎందుకంటే కుడికాలు కదిపినప్పుడు 'ఇలియోసోయాస్' అనే కండరం
కదులుతుంది. ఇది లోపల ఉండుకాన్ని తాకుతుంది. దీంతో కుడికాలు కదుపుతుంటే
లోపల నొప్పి తీవ్రమవుతుంది. అయితే.. బొద్దుగా ఉండే పిల్లల్లో ఆ ప్రాంతంలో
నొక్కినా వారు వెంటనే స్పందించకపోవచ్చు. అందుకే వీరిలో అపెండిసైటస్
ముదిరిపోయి.. అది లోపల చీముతో పగిలిపోవటమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది.
అందువల్ల బొద్దు పిల్లల్లో అపెండిక్స్ ప్రాంతంలో నొప్పి వస్తే జాగ్రత్తగా
ఉండాలి.
నిర్ధారణ
వైద్యులు స్వయంగా వివిధ రకాలుగా పరిశీలించిన తర్వాత
అపెండిక్స్ వాపు అని బలంగా అనుమానిస్తే.. కచ్చితమైన నిర్ధారణ కోసం ఇతర
పరీక్షలు చేయిస్తారు. వీటిల్లో ఆల్ట్రాసౌండ్ ముఖ్యమైంది. దీని ద్వారా
అపెండిక్స్ వాపును కచ్చితంగా గుర్తించొచ్చు. నిజానికి వాపులాంటి సమస్యలేమీ
లేకుండా అపెండిక్స్ ఆరోగ్యంగా ఉంటే ఆల్ట్రాసౌండ్ పరీక్షలో కనిపించటం
కష్టం. అపెండిక్స్ వాచినప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక
అపెండిక్స్ గోడ మందంగా కూడా మారినట్టు తెలుస్తుంది. దీని మందం 6 ఎంఎం
కన్నా ఎక్కువుంటే అపెండిక్స్ వాచిందని అనుమానం.9 ఎంఎం కన్నా ఎక్కువుంటే
కచ్చితంగా వాపేనని నిర్ధారణ చేస్తారు. అపెండిక్స్ చుట్టూ చీము లేదా ద్రవం
ఏవన్నా చేరి ఉన్నాయా అన్నది 'పెరీ ఎపెండిక్యులర్ కలెక్షన్' తేలుస్తుంది.
వీటితో చాలా వరకు అపెండిసైటిస్ అని కచ్చితంగా తెలిసిపోతుంది.
రక్తపరీక్షలు
అపెండిక్స్
వాచినప్పుడు రక్తంలో తెల్లకణాలు అధిక సంఖ్యలో ఉంటాయి. నొప్పితో పాటు
క్యూబిక్ మిల్లీలీటర్ రక్తంలో 10 వేల కన్నా ఎక్కువ తెల్లకణాలు ఉంటే
అపెండిసైటస్ అని భావించొచ్చు. ఈ తెల్లకణాల్లోనూ న్యూట్రోఫిల్స్ సంఖ్య 70
శాతం కన్నా ఎక్కువుంటాయి. ఇక సీ-రియాక్టివ్ ప్రోటీన్ 6 కన్నా ఎక్కువుంటే
ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు అర్థం.
చికిత్స
వైద్యుల పరీక్ష,
ఆల్ట్రాసౌండ్‌లలో అపెండిక్స్ వాచినట్టు స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా
ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఆల్ట్రాసౌండ్ ఫలితం స్పష్టంగా
లేకపోతే.. రక్తపరీక్ష ఫలితాలను చూస్తారు. అప్పటికీ ఉండుకం నొప్పేనా? కాదా?
అన్నది స్పష్టంగా తేలక అనుమానంగా ఉంటే బాధితులను ఆస్పత్రిలో చేర్చి
జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నొప్పి తీవ్రంగా లేకపోయినా ఆల్ట్రాసౌండ్
పరీక్షలో స్పష్టంగా కనిపించకపోయినా రక్తంలో తెల్లకణాలు అంత ఎక్కువగా
లేకున్నా.. యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయొచ్చు. ఈ సమయంలో ఎటువంటి
ఆహారం ఇవ్వకుండా సెలైన్ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి
లభిస్తుంది. ఇలా 24-48 గంటల్లో అపెండిక్స్ వాపు లక్షణాలు తగ్గుముఖం
పడతాయి. అప్పుడు తిరిగి పరీక్షించి మందులతో చికిత్స చేయాలా? ఆపరేషన్
చేయాలా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ తగ్గకుండా నొప్పి
పెరుగుతూ అపెండిక్స్ వాపు లక్షణాలు స్పష్టమవుతుంటే ఆపరేషన్ చేయాల్సి
ఉంటుంది.
అపెండిక్స్ వాచినట్టు ఒకసారి గుర్తిస్తే ఆపరేషన్ చేసి
తొలగించటం తప్ప మరో మార్గం లేదు! వాపును మందులతో తాత్కాలికంగా తగ్గించినా
కొద్దిరోజుల తర్వాత అది తిరిగి వాచే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీ చేయటం
ఉత్తమం. అపెండిసైటస్ అని నిర్ధారణ అయ్యి నొప్పి తీవ్రంగా ఉంటే..
సాధ్యమైనంత త్వరగా 24 గంటల్లోపే సర్జరీకి వెళ్లటం ఉత్తమం. ఇలాంటి
పరిస్థితుల్లో సమయం వ థా చేసినకొద్దీ అది పగిలి.. అందులోని చీము, మలం పొట్ట
అంతా విస ్తరించొచ్చు. దీంతో ప్రాణానికీ ప్రమాదం ముంచుకొస్తుంది. ఒకవేళ
ఆపరేషన్ చేసి అదంతా శుభ్రంగా కడిగినా పేగులు అతుక్కుపోయే అవకాశం చాలా
ఎక్కువ. కాబట్టి అది స్పష్టంగా అపెండిసైటిస్ అని తేలితే ఆపరేషన్
చేయించుకోవడం, అనుమానంగా ఉంటే ఉండుకాన్ని కాపాడటానికి మందులతో
ప్రయత్నించటం మంచిది.
నొప్పులన్నీ ఒకటేనా..?
పొట్టలో కుడివైపు వచ్చే
నొప్పులన్నీ ఉండుకం నొప్పులే కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరత్రా ఎన్నో సమస్యల్లో
కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు
వచ్చినప్పుడు, నీళ్ల విరేచనాలు ఉన్నప్పుడు, మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్
వచ్చినప్పుడు, పొట్టలోని లింఫ్ గ్రంథులు వాచినప్పుడు, ఆడపిల్లల్లో
పొత్తికడుపు వాపు (పీఐడీ) సమస్య ఉన్నప్పుడు, కాలేయంలో చీము వంటి సమస్యలు
తలెత్తినప్పుడు, చివరికి కుడివైపు ఊపిరితిత్తి కింది భాగంలో న్యూమోనియా
వచ్చినప్పుడు కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు.
ఆపరేషన్ రెండు రకాలు
అపెండిక్స్‌ని
తొలగించటానికి రెండు రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొట్టమీద
కోతపెట్టి చేసేది... రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటిద్వారా కెమెరా
గొట్టంతో ఉండుకాన్ని తొలగించే ల్యాప్రోస్కోపిక్ పద్ధతి. రెండూ సమర్థమైనవే.
కాకపోతే ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తే త్వరగా కోలుకుంటారు. కండరాలను
పెద్దగా కొయ్యాల్సిన పని ఉండదు. కండరాల నొప్పి అంతగా ఉండదు. త్వరగా లేచి
తిరుగుతారు. పొట్ట మీద పెద్ద మచ్చలూ ఉండవు.