Monday, November 14

ఉపవాసం...

*ఉపవాసం.. ఇలా ఫలవంతం
* పండుగల వేళ పాటించాలివీ..
* పండ్లు, నీరు తప్పని సరి
* పిల్లల్ని వద్దంటున్న నిపుణులు

భక్తితో కావొచ్చు.. బరువు తగ్గించుకోవడానికి అవ్వొచ్చు. కారణం ఏదైనా, చాలా మంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా దీక్ష చేస్తుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మధుమేహం, ఎసిడిటి వంటి సమస్యలున్న వారు, గర్భిణులు, పిల్లలు ఉపవాసం చేయకపోవడం మేలంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో 13 ఏళ్ల బాలిక 64 రోజులు ఉపవాసదీక్ష చేపట్టి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.

ఉపవాసం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో క్రమశిక్షణ అలవడటానికి ఉపయోగపడుతుంది. సాధారణ ఆరోగ్యాన్ని కాస్త మెరుగు పరిచే అంశమైనా పండుగల వేళ దీని పరిధి మితిమీరితే ప్రమాదమని, చిన్నపిల్లల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన సందర్భాల్లో గంటల్లో తప్ప.. రోజులు, వారాలు ఉండాల్సిన అవసరంలేదని వారు సూచిస్తున్నారు. రోజుల తరబడి చేయడం వల్ల ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.
* నీరు కూడా తాగకుండా రెండు, మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటున్న వారు ఉన్నారు. ఎక్కువగా కార్తీక మాసంలో చాలా మంది దీక్ష చేస్తుంటారు. వీరే కాకుండా అయ్యప్ప భక్తులు, గోవింద ధారణ భక్తులు ఇలా ఉపవాసాలు ఉండి భగవంతుడిని పూజిస్తారు. కొందరు రోజుకో దేవుడి పేరుతో తినకుండా ఉంటారు. కఠినమైన ఉపవాసం చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజులో ఓ పూటయినా ఏదో ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు. భగవంతుని ఆరాధనలకు ఎలాంటి ఆటంకం లేకుండా పండ్లు, పాలు వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఆటంకాలు ఉండవు. ఆహారం, మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటే శరీరం నీరసించి ఏకాగ్రత లోపించే ప్రమాదముంది. ఉపవాసం పేరిట అసలు తినకుండా ఉండటం మంచిది కాదంటున్నారు. మనం తీసుకునే ఆహారం బట్టే మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
* మేలుతో పాటు కీడు
ఉపవాసం వల్ల మేలుతో పాటు కీడు ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఉపవాసం వల్ల మితాహారం తీసుకోవడం, కేలరీలు నియంత్రణ, ఇన్సులిన్‌, రెసిస్టెన్స్‌ మెరుగు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, రక్తపోటు, క్యాన్సర్‌ కణాల ఉత్పత్తి విస్తరణ తగ్గే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే ఉపవాసం దీర్ఘకాలిక రోగాలను నివారిస్తోందని చెబుతున్నారు. అదే విధంగా పూర్తిగా ఎలాంటి ఆహారం తీసుకోకుంటే ఆరు రోజుల తర్వాత శరీరంలో విపరీత మార్పులు చోటుచేసుకుని ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు.
* వయోధికులైతే మేలు
వయోధికులు ఉపవాసం చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. జీర్ణవ్యసవ్థ క్రమబద్ధం అవుతుంది. ఆరోగ్య శ్రేయస్సు కోసం సున్నితమైన ఉపవాసంలో కూరగాయలు, పండ్లు, రసాలు తీసుకోవాలి. మితమయిన పరిణామంలో పాల ఉత్పత్తులు, మొలకెత్తిన గింజలు చేర్చుకోవాలి.
* దీక్ష విరమణలో జాగ్రత్తలు
దీక్ష విరమించే వేళ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తక్షణ శక్తినిచ్చే కొంత నిమ్మరసం తాగాలి. ఏదైనా పండ్ల రసం తీసుకోవడం మంచిది. భోజనాన్ని ఆబగా తినకూడదు. విందులు, వినోదాలకు కాస్త దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారం ఎక్కువైతే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. కొందరు నూనె, నెయ్యితో చేసిన మిఠాయిలు, కొవ్వు పదార్థాలు తీసుకుంటారు. ఇదీ మంచిది కాదు.
* దీక్ష సమయంలో పండ్లు, కూరగాయల ముక్కలు తీసుకోవడం మంచిది. పండ్లు ఎక్కువగా తింటే కడుపు నిండిన భావన ఉంటుంది. ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్లరసం, నిమ్మ రసం, కూరగాయల రసాలు తీసుకోవాలి. ఇలా చేస్తే ఎసిడిడి బాధ ఉండదు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటే కణాలు దెబ్బతిని మెదడుపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
* అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు తినవచ్చు. ఉదయం పూట విత్తనాలు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* నీరు తాగకుంటే డీహైడ్రేషన్‌
ఉపవాసంలో మంచి నీళ్లు తాగకూడదని కొందరు చెబుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. మన శరీరంలో మూడింట రెండొంతులు నీళ్లే ఉంటాయి. మెదడు కణజాలంలో 70 నుంచి 80 శాతం వరకు నీరే ఉంటుంది. శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువ. మన ఒంట్లో రెండు శాతం నీళ్లు తగ్గినా డీహైడ్రేషన్‌కు దారి తీసే ప్రమాదముంది. ఉపవాసం వేళ నీరు తాగకుంటే ప్రమాదమే ఎక్కువ.

No comments:

Post a Comment