Wednesday, April 12

వేసవిలో చర్మ సంరక్షణ..

      కొందరిలో చర్మం త్వరగా నల్లబడుతూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో కాసేపు బయటకు వెళ్లినా, తీసుకునే ఆహారంలో మార్పు వచ్చినా, నీటి ప్రభావం వల్లనో చర్మం రంగుమారి నల్లగా మారుతుంది. అంతేకాక కొందరిలో చర్మం మంట కూడా పుడుతుంది. ఇలాంటి సమస్యను పిగ్మెంటేషన్‌ సమస్య అంటారు. సాధారణంగా చర్మం రంగును నిర్ణయించేే రసాయనం మెలనిన్‌. మెలనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అయితే నలుపు రంగులోకి మారడం సహజం. హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు జరిగినా, ఎప్పుడూ మందులు వాడే వారిలోనూ, వెంట్రుకలకు రంగులు వేసుకునే వారిలోనూ ఇలాంటి పిగ్మెంటేషన్‌ సమస్యలు ఎక్కువగా కనబడతాయి. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాల ప్రభావం చర్మం రంగుపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎండలో వెళ్లేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, గొడుగు తప్పనిసరిగా వాడాలి. అలా కుదరని పరిస్థితిలో చేతి రుమాలు ముఖానికి ఎండ తగలకుండా కట్టుకోవడమైనా చేయాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది...
  1. నల్ల ద్రాక్ష బాగా తినాలి. పుచ్చకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది.
  2. ఎండాకాలం దానిమ్మ పండ్లు కూడా ఆరోగ్యానికి, చర్మ రక్షణకు చాలా ఉపయోగపడతాయి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. చర్మ రక్షణకేకాక శరీరంలోని మలినాలను తొలగించేందుకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
  3. తాజా పండ్ల రసాలను తాగుతూ ఉండాలి. మజ్జిగ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా వీలయితే అంత ఎక్కువ మజ్జిగ తాగడం మంచిది.
  4. ఎండలో బయటకు వెళ్లవలసినపుడు అరగంట ముందే సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. బయట నుండి రాగానే మళ్లీ కడిగేేసుకోవాలి.
  5. క్యాబేజి, క్యారెట్‌లతో పాటు ఓట్స్‌ కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిలో కొంత పాల మీగడ వేసి కలపాలి. తర్వాత కొంచెం తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి, ముఖానికి రాసుకోవాలి. అర గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.
  6. నల్ల ద్రాక్ష గుజ్జుకు కొంచెం తేనె కలిపి స్నానానికి ముందు ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే ముఖంపై ఉన్న మచ్చలు మాయమవుతాయి.
  7. ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కీరదోసను ముక్కలుగా చేసి కళ్లపైన, ముఖంపైన కాసేపు ఉంచుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.
  8. పిగ్మెంటేషన్‌ సమస్య రాకుండా ముందు జాగ్రత్తపడితే చాలా మంచిది. అన్నిటికీ సరైన ఔషధం మంచినీళ్లు బాగా తాగడం. ఎండలో వెళ్లినపుడు నీడలో నడవడం, రుమాలు చుట్టుకోవడం, కాసేపు చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం లాంటి జాగ్రత్తలు అవసరం.

No comments:

Post a Comment