వేసవి వచ్చిందంటే ఇక పిల్లలకు ఆటలే ఆటలు. తోటి పిల్లలతో
ఆటలలో పడి ఆకలి, దాహం అన్నీ మర్చిపోతారు. ఎండ వేడిమిని పెద్దగా
పట్టించుకోరు. ఇటువంటప్పుడే వారు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది.
అందుకే పిల్లలు వేసవిలో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తరచూ అనారోగ్యం
పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడంతో పిల్లల శరీర ఉష్ణోగ్రత
పెరగడం, ఎక్కువ చెమటతో వంట్లో నీరు వేగంగా ఆవిరైపోవడం.. ఇవి వడదెబ్బకు
దారితీస్తాయి. అందుకే ఈ కాలంలో చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త అవసరం.
పెద్దవాళ్లు పిల్లలకు ఎండేముంటుందిలే అని నిర్లక్ష్యం చేయడం అనర్ధానికి
దారి తీస్తుంది. మరి వారిని ఎండ బారి నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలో
చూద్దాం...
- ఎండ తీవ్రత పెరిగే సమయానికి పిల్లలు ఇంటి వద్దే ఉండేలా చూడాలి. రెండు పూటలా స్నానం చేయించి చెమటను పీల్చే తెల్లని లేదా లేత రంగు నూలు దుస్తులు వేయాలి.
- ఇంటి వద్ద ఎండ, వేడి గాలి తగలని చల్లని ప్రదేశంలో వారు ఆడుకునేలా, నిద్రపోయేలా జాగ్రత్త పడాలి.
- ఈ కాలంలో పిల్లలు తినడానికి ఇష్టపడరు. చల్లని పానీయాలు తాగేందుకే మొగ్గు చూపుతారు. అందుకే ఎండ తీవ్రం కాక ముందే బ్రేక్‌ఫాస్ట్ పూర్తిచేసేలా చూడాలి. బేకరీ పదార్థాలు కాకుండా ఇంటి వద్ద తయారు చేసిన ఆహారాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి. దీనిలో నూనెలు లేకుండా ఉంటే మంచిది. దీనితోపాటు రాగి, సజ్జలు వంటి తృణధాన్యాల జావను మజ్జిగలో లేదంటే పాలలో కలిపి ఇస్తే పిల్లలు డీ హైడ్రేషన్‌కు గురికారు. ఎండా కాలంలో పిల్లలు ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల ఏర్పడే పోషకాల లోటును ఇవి భర్తీ చేస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ తరువాత కొద్ది సమయానికి నిమ్మకాయ రసం, ఖర్జూర కాయలు పిల్లలకు ఇస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో మధ్యాహ్న భోజనం చేయడానికి పిల్లలు అయిష్టత చూపరు.
- మధ్యాహ్న భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి. ఈ కాలంలో పిల్లలు అన్నం తక్కువ తిని చిరుతిళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. శీతల పానీయాలు తాగాలని అల్లరి చేస్తారు. వారు మారాం చేస్తున్నారు కదా అని పంచదార కలిపిన జ్యూస్‌లు, కంపెనీ కూల్ డ్రింక్‌లు, ఐస్‌క్రీంలు పిల్లలకు ఇవ్వడం వల్ల డీ హైడ్రేషన్ ప్రభావం పెరుగుతుంది.
- ఆహారంలోనూ, చిరుతిళ్లలోనూ పాలకూర, ఉల్లి, ముల్లంగి, బీట్ రూట్, అనాస, మామిడి, కర్బూజా, పుచ్చకాయ, కీర దోసకాయ, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం ఉండేలా చూడాలి. ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను పిల్లలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
- చెమట రూపంలో శరీరం కోల్పోయిన లవణాల్ని అందించడానికి మాత్రం మజ్జిగ, నిమ్మ రసం ద్వారా పిల్లల శరీరానికి ఉప్పు అందేలా చూడాలి.
No comments:
Post a Comment