మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణాల వల్ల అదనంగా గ్యాస్ తయారు కావడమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి.
లక్షణాలు :-
గ్యాస్ సమస్య కలిగిన వారికి అప్రయత్నంగానే విడుదలవుతుం టుంది. గ్యాస్ వల్ల కడుపునొప్పిగా అనిపిస్తుంది. కడుపులో నొప్పి చాలా తీక్షణంగా, ఉదరకండరాలను పట్టేసినట్టు ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస ్‌వల్ల వచ్చే కడుపునొప్పి ఉదరంలో ఒక భాగంలో కేంద్రీకృ తం కాకుండా త్వరితగతిన మారుతుం టుంది. ఆమ్లాశయంలో కండరాలు ముడిపడినట్టు అనిపించొచ్చు. గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో ఎడమవైపు పైభాగంలో నొప్పి వస్తుంటే గుండెనొప్పిగా భ్రమకలుగుతుంది. అలాగే గ్యాస్ వల్ల ఒకవేళ ఉదరంలో కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంటే ఎంపెండిసైటిస్‌గా లేదా గాల్‌స్టోన్స్ నొప్పిగా భ్రమ కలుగుతుంది. పొట్ట ఉబ్బరింపుగా నిండిపోయినట్టు బిర్రుగా అనిపించడం గ్యాస్ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతో పొట్ట వచ్చినట్టు, మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్టు కనిపిస్తుంది.
కారణాలు :-
- మాట్లాడేటప్పుడు గానీ, ఆహారాన్ని మింగేటప్పుడు గానీ గాలిని మింగటం.
- ఆందోళనగా ఉన్నప్పుడు గానీ ఉధ్విగంగా ఉన్నప్పుడు గానీ గాలిని అసంకల్పితంగా మింగటం
- ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం.
- చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం.
- స్ట్రాతో ద్రవ పదర్థాలు తాగటం.
- ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం.
- పండ్లు, కాయగూరలు, గింజధాన్యం, బీన్స్, చిక్కుడు, బఠాని తదితర పీచు పదార్థాలు అరగకపోవటం.
- సోడా, బీర్, శీతలపానీయాలు తదితర గాలి నిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం.
- ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం (డైవర్టిక్యులైటిస్, క్రాన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైస్).
- యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి).
- విరేచనౌషధాలను గాని లేదా మలాన్ని బంధించే ఔషధాలను గానీ వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి).
- మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం (మలం బిరడా వేయటం వల్ల గ్యాస్ కింద నుంచి వెళ్లలేక, పొట్ట ఉబ్బరింపు కలుగుతుంది).
- పాలలోని ల్యాక్టోజ్ అనే తీపి పదార్థాన్ని శరీరం సూక్ష్మాంశాలుగా విభజించి జీర్ణించుకోలేకపోవటం (మిల్క్ ఇంటాలరెన్స్).
- గోధుమల్లోని గ్లూటెన్ అనే జిగురు పదార్థాన్ని శరీరం అనుఘటకాలుగా విభజించి విలీనం చేసుకోలేకపోవటం (గ్లూటెన్ ఇంటాలరెన్స్).
- ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు పడపోవటం (బబుల్‌గమ్స్, సుగర్ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్, మ్యానిటాల్ వంటి పదార్థాలు గిట్టకపోవటం).
గ్యాస్ కలిగించే ఆహారాలను మానేయాలి. అన్ని ఆహార పదార్థాలూ ఒకే మాదిరిగా గ్యాస్‌ని, గ్యాస్ నొప్పిని కలిగించవు. వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్టనిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచుపదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్పమోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.
పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడ లేదా వేడి వేడి పుదీనా కషాయం తీసుకోవాలి. పుదీనాలో ఉండే మెంథాల్ (పిప్పర్‌మింట్) జీర్ణావయవాల కండరాలను వదులు చేసి గ్యాస్ సంచితవకుండా చేస్తుంది. అయితే ఒకవేళ ఎసిడిటి గానీ, రిఫ్లక్స్ గానీ ఉంటే పుదీనాలోని మెంథాల్ ఆ సమస్యలను ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది.
జీవన విధానం :-
ఆహారాన్ని కొద్ది మొతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. బబుల్‌గమ్ నమలటం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో పానీయాలు తాగటం మానేయాలి. ఈ చర్యలతో గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పుడు గానీ, గాబరాగా ఉన్నప్పుడు గానీ, హడావుడిగా ఉన్నప్పుడు గానీ ఆహారం తీసుకోవద్దు. ఎప్పుడూ నింపాదిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.
చిట్కాలు :-
- ఉదర కండరాల మీద టర్పెంటైన్ ఆయిల్‌ని వేడిచేసి మర్దన చేయాలి. ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. దీనితో ఉదరకండరాల్లో స్తబ్దత తగ్గి పేగుల కండరాలు వదులవుతాయి. ఫలితంగా గ్యాస్ తప్పించుకుని ఉపశమనం లభిస్తుంది.
- వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి ముందు అరచెంచాడు తీసుకోవాలి.
- ఇంగువను దోరగా వేయించి, పొడి చేసి పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు.
- జీలకర్ర రెండు భాగాలు, శొంఠి నాలుగు భాగాలు, ఉప్పు ఒక భాగం, శంఖభస్మం (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) రెండు భాగాలు తీసుకుని మెత్తగా నూరి, నిష్పత్తి ప్రకారం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
- గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిశ్రమాన్ని అరచెంచాడు మోతాదుగా వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి.
- ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి.
- వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకుని సైంధవ లవణం కలిపి నూరి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
- నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకుని తింటుండాలి.
- త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసరి కాయ వలుపు), త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) చూర్ణాన్ని సమ భాగాలుగా తీసుకుని కషాయం తయారు చేసి తాగాలి.
- నల్లజీలకర్ర (కలౌంజి) గింజలు (4 భాగాలు), శొంఠి (2 భాగాలు), నల్ల ఉప్పు (1 భాగం), శంఖభస్మం (1 భాగం) నిష్పత్తిలో తీసుకుని దంచి పొడిచేయాలి. ఈ మిశ్రమాన్ని 3-6 గ్రాముల మోతాదుగా పుచ్చుకోవాలి.
- ఆరు భాగాలు నిమ్మరసానికి ఐదు భాగాలు చక్కెర కలిపి పానకం తయారు చేసుకోవాలి. రెండు చెంచాల మోతాదులో నీళ్లతో కలిపి తీసుకోవాలి.
No comments:
Post a Comment